చీరాల : రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు. రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈ రోజు బాపట్ల మరియు చీరాల ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద రవాణా శాఖ అధికారులు హాస్పిటల్ సిబ్బందికి “రహ్ వీర్” ల రక్షణ గురించి వివరించారు.
ఈ సందర్భం గా పరంధామ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయపడేవారిని రహ్ వీర్ లు గా గుర్తిస్తారని, వారిని బాధితులను హాస్పిటల్ నందు చేర్పించే సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయకుండా ఉండేదుకు మోటార్ వాహనముల చట్టము సెక్షన్ 134 ఎ ద్వారా రక్షణ కల్పించబడినదని తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది గాని, పోలీస్ వారు గాని రహ్ వీర్ లను, వారు స్వచ్ఛందంగా తెలియ జేస్తే తప్ప, పేరు చిరునామా తెలుపమని వత్తిడి చెయ్యరాదని, వారు బాధితులను హాస్పిటల్ నందు చేర్చిన వెంటనే అచ్చటి నుండి వెళ్లిపోవుటకు ఎటువంటి అభ్యంతరం పెట్టరాదని తెలిపారు.
రహ్ వీర్ లకు రూ. 25,000/- నగదు బహుమతి కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ విషయాలను తెలియచేసే గోడ పత్రికలను ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు మరియు సిబ్బంది బాపట్ల మరియు చీరాల లో గల వివిధ హాస్పిటల్స్ నందు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ డి.బి.వి. రంగారావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, బి. కిషోర్ బాబు, కె, రవినాయక్, మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు .
డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, బాపట్ల జిల్లా.
#Narendra
