Home South Zone Andhra Pradesh అమరావతికి చట్టబద్ధత… పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.

అమరావతికి చట్టబద్ధత… పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.

0

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో కీలక పరిణామం
వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను సేకరిస్తున్న హోంశాఖ
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణకు సన్నాహాలు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చర్యతో రాజధానిపై ఉన్న అనిశ్చితికి తెరపడనుంది.

2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. 2024 జూన్ 2తో ఆ గడువు ముగియడంతో, ఏపీకి స్వతంత్ర రాజధానిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, అమరావతిని రాజధానిగా ఖరారు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ఒక నివేదిక పంపింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, చేపట్టిన నిర్మాణాల వివరాలతో కూడిన నోట్‌ను సమర్పించింది.

ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోంశాఖ, దీనిపై తదుపరి చర్యలు ప్రారంభించింది. రాజధాని ఎప్పటి నుంచి అమల్లోకి రావాలో స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, 2024 జూన్ 2 నుంచే వర్తింపజేయాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖలతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాలను కూడా కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది.

అన్ని శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. క్యాబినెట్ ఆమోదం లభించగానే, పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణ కోసం బిల్లును ప్రవేశపెడతారు. ఈ చట్టసవరణతో అమరావతికి రాజధానిగా శాశ్వత భద్రత, చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. తద్వారా భూములిచ్చిన రైతులకు, పెట్టుబడిదారులకు భరోసా కలుగుతుందని, రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతాయని అధికారులు భావిస్తున్నారు

NO COMMENTS

Exit mobile version