దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ
విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు జెరోధాకు ప్రతిపాదన
గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాలపై జపాన్ సంస్థ ‘జెరా’తో కీలక చర్చలు
విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని స్కేల్ ఏఐకి ఆహ్వానం
ప్రతిపాదనలను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన గ్లోబల్ కంపెనీలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రాన్ని టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తన పర్యటనను వేగవంతం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో భాగంగా ఆయన ఫిన్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, స్పష్టమైన ప్రతిపాదనలతో వారిని ఏపీకి ఆహ్వానించారు.
విశాఖలో టెక్ హబ్.. జెరోధాకు ప్రతిపాదన
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘జెరోధా’ ఫౌండర్ నిఖిల్ కామత్‌తో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నాన్ని ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా అక్కడ ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్లాట్‌ఫామ్ ఇంజనీరింగ్, బ్యాకెండ్ సిస్టమ్స్, ట్రేడింగ్ అల్గోరిథంలు, డేటా అనలిటిక్స్‌పై ఈ కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం కావాలని, యువ పారిశ్రామికవేత్తలకు లీడ్ మెంటర్‌గా వ్యవహరించాలని ఆహ్వానించారు.
