కర్నూలు సిటీ :
ఇంటింటి చెత్తసేకరణ 100% జరగాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• తడి, పొడి చెత్తా వేర్వేరుగా సేకరించాలి• బ్లాక్ స్పాట్స్ పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలునగరంలో ఇంటింటి చెత్తా సేకరణ 100 శాతం పక్కాగా అమలయ్యేలా అన్ని శానిటేషన్ డివిజన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.
నగరంలో తడి, పొడి చెత్తాను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి రోజూ 100 శాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ జరిగేలా సిబ్బంది పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అలసత్వం లేదా మిస్ అవ్వడం జరిగితే సంబంధితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.బ్లాక్ స్పాట్స్ ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ఉన్న బ్లాక్ స్పాట్స్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.
ఆయా ప్రాంతాల్లో మళ్లీ చెత్తా వేయకుండా అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ ద్వారా వాహనాల కదలికలను పర్యవేక్షించాలని, సిబ్బంది హాజరు, పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ప్రధాన రహదారులు, మార్కెట్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్టాండ్ల వద్ద పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. మురుగు కాలువల క్లీనింగ్, డీ-సిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఐవిఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా
ఉపయోగించుకోవాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.నెగటివ్ ఫీడ్‌బ్యాక్ లేదా ఫిర్యాదు వచ్చిన రోజే ఫీల్డ్ విజిట్ చేసి సమస్యను పరిష్కరించి క్లోజ్ చేయాలని సూచించారు. స్లూ ఫీల్డ్ టీమ్‌లు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి పరిష్కరించేలా పనిచేయాలని, ప్రతి ఫిర్యాదుపై పూర్తి బాధ్యతతో స్పందించాలని కమిషనర్ తెలిపారు. ఫీల్డ్ సిబ్బంది పనితీరు మెరుగుపడితేనే నగరంలో పరిశుభ్రత స్థాయి మరింత పెరుగుతుందని అన్నారు. రేపటి నుంచి అన్ని ఫీల్డ్ సిబ్బంది, ఐవిఆర్‌ఎస్ సూపర్‌వైజర్లు పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, శానిటేషన్ ఇంస్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
