Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.

ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ
పిఠాపురం స్టేషన్‌ను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి
మంజూరైన రోడ్ ఓవర్ బ్రిడ్జిని పీఎం గతి శక్తిలోకి మార్చాలని అభ్య‌ర్థ‌న‌
పవన్ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. పిఠాపురంలో చేపట్టాల్సిన పలు కీలక రైల్వే అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.

పిఠాపురం రైల్వే స్టేషన్‌ను “అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” కింద చేర్చి, ఒక మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని పవన్ ప్రధానంగా కోరారు. పిఠాపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి కావడం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జన్మస్థలం కావడంతో దేశవ్యాప్తంగా భక్తుల తాకిడి అధికంగా ఉందని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

అలాగే, పిఠాపురంలో సేతు బంధన్ పథకం కింద ఇప్పటికే మంజూరైన రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) ప్రాజెక్టును “పీఎం గతి శక్తి” పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల లెవల్ క్రాసింగ్ సమస్యలు తొలగి, ట్రాఫిక్ ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. ఈ ROB కోసం గతంలోనే కేంద్రం రూ.59.70 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు కాకినాడ-పిఠాపురం మధ్య రైలు కనెక్టివిటీని పెంచాలని కూడా ఆయన కోరినట్లు తెలిసింది.

పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఇతర పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

అయితే, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రైల్వే కోడూరు కేసులో జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై వస్తున్న ఆరోపణల గురించి విలేకరులు ప్రశ్నించగా, పవన్ కల్యాణ్ ఆకస్మికంగా మీడియా సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై పార్టీ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, నివేదిక వచ్చే వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు జనసేన వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments