Home South Zone Andhra Pradesh మత్స్య కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

మత్స్య కార్మికుల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

0

మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం*

ప్రతి మత్స్యకారుడు పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే సంకల్పం
మత్స్యకార సొసైటీల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆక్వా రంగంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం
* ఆఫ్ కాఫ్ చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకార మ‌హోత్స‌వంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత, అచ్చెన్నాయుడు

విజ‌య‌వాడ‌:- తమ ప్రభుత్వానికి మత్స్యకార సామాజిక వర్గం అంటే ఎంతో ఇష్టమని, స్వాతంత్రం వచ్చిన 35 ఏళ్ల వరకు మత్స్యకారులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, కానీ దివంగత ముఖ్యమంత్రి యన్.టి. రామారావు నుండి వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. న‌గ‌రంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్ కాఫ్) చైర్మన్, పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మంత్రులు స‌విత‌, కొల్లు ర‌వీంద్ర‌ల‌తో క‌లిసి ఎన్‌టీఆర్‌, జ్యోతిరావు పూలే, మాజీ మంత్రి న‌డికుదిటి న‌ర‌శింహ‌రావు చిత్ర‌ప‌టాల‌కు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. భీష్మ ఏకాద‌శి సంద‌ర్భంగా భీష్ముని చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేశారు.

అనంత‌రం ఆఫ్ కాఫ్ పాల‌క‌వ‌ర్గం ఛైర్మ‌న్‌, వైస్ ఛైర్మ‌న్‌, 11 మంది డైరెక్ట‌ర్ల‌తో మంత్రి అచ్చెన్నాయుడు ప్ర‌మాణం చేయించారు.

అనంత‌రం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత 44 ఏళ్లుగా కష్ట సుఖాల్లో మత్స్యకారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వెన్నంటి ఉంటున్నారని పేర్కొన్నారు. మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనని, ఈ విషయాలను నేటి యువతకు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించి, కనీసం డీజిల్ సబ్సిడీ, ప్రమాద బీమా వంటివి కూడా సరిగ్గా అందించలేదని విమ‌ర్శించారు.

రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రతి మత్స్యకారుడిని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, లక్షలాది కుటుంబాలు మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 217 మత్స్యకారుల ప్రయోజనాలకు విరుద్ధమని, దానిపై పోరాడి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం ద్వారా దానిని రద్దు చేసామన్నారు.

రాష్ట్ర బి.సి. సంక్షేమ శాఖా మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ, తెలివికి, ధైర్యానికి మారుపేరు మత్యకారులని, సముద్రంతో పోరాడి చేపలను వేటాడి సమాజానికి అందించే మత్స్యకారుల ధైర్యాన్ని, కృషిని మంత్రి అభినందించారు. మత్స్యకారులు ఎప్పటి నుంచో తమ ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. బీసీలంటే తమ ప్రభుత్వమని..

దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. మత్స్యకారుల భృతిని రూ.10,000 నుండి రూ.20,000కు పెంచామన్నారు. గతంలో 9 మత్స్యకార గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి, అందులో 47శాతం రిజర్వేషన్లు మత్స్యకార బిడ్డలకే ఇచ్చామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్ కాఫ్) నూతన చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ మాట్లాడుతూ, మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై,

ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గం ఎదుర్కొన్న సమస్యలపై అనేక పోరాటాలను చేసానన్నారు. అధిష్టానం, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత సూచనల మేరకు, సమైక్య 13 జిల్లాల మత్స్యకార సంఘాల మద్దతుతో మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్‌గా ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డ‌ప్పగారి మాధ‌విరెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే గుత్తా చైత‌న్య రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు శ్రీనివాసుల రెడ్డి, కార్పొరేష‌న్ల ఛైర్మ‌న్లు వీరంకి వెంక‌ట గురుమూర్తి, ఎరుబోతు ర‌మ‌ణారావు, ఈశ్వ‌ర్ ప్రేరేపి, పాపారావు, శ్రీధర్, జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు, త‌దితరులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మానికి మ‌త్స్య‌కారులు, కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు.

NO COMMENTS

Exit mobile version