కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి
జగన్ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న క్రాంతి
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లపూడి క్రాంతి ఎక్స్ వేదికగా స్పందిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్, తన తండ్రి ముద్రగడపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభద్రతాభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
జగన్ రాజకీయ లాభాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి రెడ్లకు అప్పగించి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కాపులు గుర్తొస్తున్నారా? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రి ముద్రగడను కూడా అలా చేయరని గ్యారెంటీ ఉందా? అని ఆమె వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ అంశంపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నా, అసలు ఏమీ జరగలేదని ముద్రగడ ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా, పాదయాత్ర సమయంలో కాపులకు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కారని, అలాంటి వ్యక్తికి తన తండ్రి ముద్రగడ మద్దతివ్వడం ఆశ్చర్యంగా ఉందని క్రాంతి పేర్కొన్నారు.




