Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపీకలవాగు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

పీకలవాగు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు బుధవారం నగర కమిషనర్ మయూర అశోక్ గారితో కలిసి విస్తృతంగా పరిశీలించారు. ప్రధానంగా 1/18 బ్రాడీపేట, కోబాల్ట్‌పేట 6వ లైన్, దేవాపురం 4వ లైన్, కంకరగుంట ఆర్‌యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.
వర్షాకాలంలో ఏర్పడే వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే గారు సూచించారు. పీకలవాగులో పేరుకుపోయిన సిల్ట్‌ను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, అవసరమైన చోట్ల ప్రహరీగోడ నిర్మాణం చేపట్టాలని కమిషనర్ గారిని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ…
పీకలవాగు నగరానికి అత్యంత కీలకమైన ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ అని తెలిపారు. గతంలో సుమారు 60 అడుగుల వెడల్పుతో ప్రవహించిన ఈ వాగు ప్రస్తుతం కేవలం 10 అడుగులకు పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ ఆక్రమణల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
పీకలవాగు పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త, వ్యర్థాలను వాగులో వేయడం వల్ల మరింత సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్య అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పించి వ్యర్థాలు వాగులో వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కోబాల్ట్‌పేట వంటి లో-లెవల్ ప్రాంతాల్లో కొత్తగా డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలని, పీకలవాగులో పూడిక తొలగింపు పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు. పూడిక తీయకపోవడం, ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో స్థానిక ప్రజలు మురుగునీటిలోనే నివసించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. పీకలవాగుపై ఉన్న కల్వర్టుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టి, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments