Monday, February 9, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమనోహర్: లడ్డూ వివాదంపై భక్తులు స్పందించాలి

మనోహర్: లడ్డూ వివాదంపై భక్తులు స్పందించాలి

లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్న మంత్రి నాదెండ్ల
అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి వాడటమే కల్తీకి నిదర్శనం
మఠాధిపతులు, ధార్మిక పెద్దలతో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించాలి

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వివాదంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మరక్షణ అని, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో సంబంధించిన అంశం కాదని,

కోట్లాది మంది విశ్వాసాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన విషయమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ వ్యవహారాన్ని రాజకీయ కక్షసాధింపుగా మార్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.

తిరుమల లడ్డులో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో, సీబీఐ సమర్పించిన నివేదిక వాస్తవాలను వెలుగులోకి తెచ్చిందని మంత్రి గుర్తుచేశారు. “60 లక్షల లీటర్ల

నెయ్యిలో ఒక్క చుక్క కూడా అసలైన నెయ్యి లేదని నివేదిక స్పష్టం చేసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడం దుర్మార్గం. వారికి ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అయోధ్యకు పంపిన లడ్డూల కోసం ‘ప్రత్యేక నెయ్యి’ వాడామని వైసీపీ నేతలు చెప్పడమే, తిరుమలలో వాడే నెయ్యి నాణ్యమైనది కాదని వారికి ముందే తెలుసనడానికి నిదర్శనం” అని మనోహర్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్, పలమనేరు నుంచి ప్రత్యేకంగా నెయ్యి తెప్పించి అయోధ్యకు లడ్డూలు పంపామని చెప్పడం ద్వారా, ఐదేళ్లుగా మిగిలిన లడ్డూల తయారీలో ప్రజలను ఎలా మోసం చేశారో వారే అంగీకరించినట్టయిందని ఆయన విమర్శించారు.

ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దాడులుగా మలచాలని చూస్తున్నారని, సమాజం ఈ కుట్రను గమనించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచన ఎల్లప్పుడూ హిందూ ధర్మాన్ని కాపాడటమే తప్ప, ఇతర మతాలను కించపరచడం కాదని ఆయన స్పష్టం చేశారు. తప్పు జరిగిందని అంగీకరించి క్షమాపణ చెప్పాల్సింది పోయి, ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయడం వారి పైశాచిక ఆనందానికి నిదర్శనమని అన్నారు.

ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా పరిగణించి, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని మంత్రి మనోహర్ అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments