చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై హైస్కూల్‌కు వెళ్తున్న గవినివారి పాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అంగిరేకుల శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మృతి చెందారు.వివరాల ప్రకారం, అంగిరేకుల శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ హైస్కూల్‌కు చేరుకుంటున్న సమయంలో, రహదారి మధ్యలో అడ్డంగా ఉన్న కేబుల్ ఆయన మెడకు తగలడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం స్కూల్‌కు ముందుగా చేరే ప్రధాన ఉపాధ్యాయుడు వస్తారని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ దుర్వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.పాఠశాలకు కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో, గవినివారి పాలెం హైస్కూల్ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేబుల్‌ను రహదారిపై నిర్లక్ష్యంగా వదిలివేయడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#Narendra




