హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.
గతంలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు థియేటర్ల యజమానులకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 121 ను హైకోర్టు సస్పెండ్ చేసింది.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు యాజమాన్యాలకు వెసులుబాటు ఉండేది. అయితే, నిబంధనల ప్రకారం థియేటర్లలో పార్కింగ్ స్థలం కల్పించడం అనేది భవన నిర్మాణ నిబంధనలలో (Building Rules) ఒక భాగమని, దీనికి అదనంగా ఫీజు వసూలు చేయడం సరికాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ తీర్పుతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు తమ వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం కలగనుంది.
మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే ఉచిత పార్కింగ్ నిబంధనలు అమలులో ఉండగా, ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లకు కూడా ఇది వర్తించనుంది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది.
#sidhumaroju
Alwal










