Home South Zone Andhra Pradesh పుట్టా మహేశ్‌పై చంద్రబాబు సీరియస్: పార్టీకి నష్టం చేసే వారిని భరించలేం.

పుట్టా మహేశ్‌పై చంద్రబాబు సీరియస్: పార్టీకి నష్టం చేసే వారిని భరించలేం.

0

మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ ఇస్తే, ఆయన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి డ్రగ్స్ పార్టీలకు వెళ్లడం క్షమించరాని తప్పని, ఇలాంటి వారి ప్రవర్తన వల్ల పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దురలవాట్లతో పార్టీ పరువు తీసే వారిని మోయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడైన మహేశ్… మంచి రాజకీయ నేపథ్యం ఉండి కూడా ఇలా ప్రవర్తించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. ఇప్పటికే పార్టీ నుండి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని, ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని గుర్తు చేశారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకులంతా ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని, వ్యక్తిగత ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

NO COMMENTS

Exit mobile version