పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం… పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న చంద్రబాబు.

0
0

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతనంగా నిర్మించిన గ్రామీణ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5 లకే నాణ్యమైన భోజనం అందించే ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 గ్రామీణ క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరింది. ఈ సందర్భంగా సీఎం స్వయంగా టోకెన్ తీసుకుని కార్మికులతో కలిసి భోజనం చేశారు. “పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టగొట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.