బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే…!

0
12

బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే…!

Andhra

Pawan Kalyan Reacts to Assembly Election Results

ప్రజా తీర్పు మార్పు, అభివృద్ధి కోసమేనన్న పవన్ కల్యాణ్

పశ్చిమ బెంగాల్‌లో చారిత్రక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు

తమిళనాడులో ఘన విజయం సాధించిన నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు

అసోంలో వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీని ప్రశంసించిన పవన్

అక్రమ వలసలున్న బెంగాల్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుండడం శుభపరిణామం అని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ ఫలితాలు మార్పు, అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టగా, మరికొన్ని చోట్ల ప్రజలు నిర్ణయాత్మక మార్పును కోరుకున్నారని విశ్లేషించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

 

“నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు.. అభివృద్ధి, స్పష్టమైన మార్పుల కోసం ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రజాతీర్పును నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. అస్సాం, పుదుచ్చేరి ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేసే నాయకత్వాన్ని మరోసారి ఆశీర్వదించగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఓటర్లు రాజకీయ మార్పును కోరుకున్నారు.

 

ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ వ్యూహరచన, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ చాతుర్యంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఈ సందర్భంగా సువేందు అధికారికి, బీజేపీ నాయకత్వానికి నా హృదయపూర్వక అభినందనలు. అక్రమ చొరబాట్లు, శాంతిభద్రతల సమస్యలతో సతమతమవుతున్న బెంగాల్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడనుండటం శుభపరిణామం.

 

అదేవిధంగా, అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీని గెలిపించి, రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న శ్రీ హిమంత బిశ్వ శర్మ గారికి నా అభినందనలు. కేరళలో విజయం సాధించిన యూడీఎఫ్ నాయకత్వానికి, పుదుచ్చేరిలో గెలిచిన ఎన్డీయే మిత్రపక్షాలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ఇక తమిళనాడులో అద్భుత విజయం సాధించిన ‘తమిళగ వెట్రి కళగం’ అధ్యక్షుడు, నటుడు విజయ్ కి నా ప్రత్యేక అభినందనలు. రాజకీయాల్లోకి వచ్చి, తొలి ఎన్నికల్లోనే విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలవడం ప్రజల మార్పు ఆకాంక్షకు నిదర్శనం. తమిళనాడు ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఆయన నిబద్ధతతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అని పవన్ వివరించారు.