సిద్దిపేట జిల్లా: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో గజ్వేల్‌లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఎంపీ ఈటెల రాజేందర్ నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ సీనియర్ నాయకులు కప్పర ప్రసాద్ తో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయని అన్నారు.
ప్రజాస్వామ్యంలో అసలు శక్తి ప్రజలదేనని, వారు కోరుకుంటే ఏ మార్పునైనా తీసుకురాగలరని పేర్కొన్నారు. గతంలో నందమూరి తారక రామారావు వంటి నాయకులు ప్రజల మద్దతుతో చరిత్ర సృష్టించినట్లు గుర్తు చేశారు.
అదే విధంగా నేటి కాలంలో కూడా సాధారణ ప్రజలే నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తున్నారని తెలిపారు.
దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధి దిశగా ప్రజలు ఓటు వేస్తున్నారని, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో దీర్ఘకాలిక పాలనకు ప్రజల విశ్వాసమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, ప్రజల ఆశలు నెరవేరకపోతే వ్యతిరేకత సహజమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కూడా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో అహంకారం, ప్రలోభాలు శాశ్వతం కాదని, ప్రజల తీర్పే చివరిది అని స్పష్టం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనపై ప్రజలు గతంలోనే తమ అభిప్రాయం వెల్లడించారని పేర్కొన్నారు.
ఎన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల ఆశలు నెరవేర్చే సమయం వచ్చిందని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సభకు హాజరవుతున్నారని తెలిపారు.
ప్రధాని సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలంతా భారీగా తరలివచ్చి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బైరి శంకర్, సీనియర్ నాయకులు కప్పర ప్రసాద్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#Sidhumaroju










