తెలంగాణలో పంటల మార్పిడి మార్పిడి అత్యవసరం

0
3

తెలంగాణలో పంటల మార్పిడి అత్యవసరమని రైతు కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఏటా వరి విస్తీర్ణం పెరుగుతూ.. కూరగాయలు, ఉద్యాన పంటల సాగు తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సుస్థిర వ్యవసాయం, రైతు ఆదాయం పెంపు, సహజ వనరుల సంరక్షణ, భవిష్యత్‌ ఆహార భద్రత కోసం రాష్ట్రంలో పంటల మార్పిడికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. వాతావరణ జోన్ల ఆధారంగా పంటల ప్రణాళికను రూపొందించాలని..

పంటల మార్పిడి లక్ష్యాలను నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సంవత్సరాల వారీగా, గ్రామాల వారీగా నిర్ణయించాలని కమిషన్‌ సూచించింది. రాష్ట్రంలో దళారీ వ్యవస్థ సమస్య ప్రధానంగా ఉందని పేర్కొంది. కేరళ తరహాలో రాష్ట్రంలో కూరగాయల క్లస్టర్‌ను, నాసిక్‌లోని సహ్యద్రి ఫార్మ్స్‌ తరహాలో ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్రంలో పంటల మార్పిడి అంశంపై రైతు కమిషన్‌ రూపొందించిన నివేదికను మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసింది.

మొత్తం 40 పేజీల నివేదికలో ఉద్యాన, సాంప్రదాయ, ఇతర ముఖ్య పంటల వివరాలను, ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనం వివరాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను వివరంగా పేర్కొంది. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) నిర్ణయించాలని.. ఇందుకోసం రైతులు సభ్యులుగా ఉండే ప్రత్యేక ధరల నిర్ణయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరింది. రాష్ట్రంలో మార్కెట్లను సందర్శించినప్పుడు దళారీ వ్యవస్థ ప్రధాన సమస్యగా ఉన్నట్టుగా గుర్తించామని, దాన్ని నియంత్రించాలని సూచించింది.