ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని అవమానపరచలేదు, సమయాభావం వల్లే మాట్లాడే అవకాశం రాలేదు: కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ గారు

0
2

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత అవాజ్  న్యూస్  ప్రతినిధి జగదీష్ )

ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జిల్లా పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి గారికి ఎక్కడా ఎలాంటి అవమానం జరగలేదని, కెరమెరి మండలం కొత్తగూడాలో ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆమె అధ్యక్షతననే ఘనంగా ప్రారంభమైందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ గారు స్పష్టం చేశారు. మంగళవారం తన నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగా గారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాకు విచ్చేసి జిల్లాకు చెందిన ఆదిమ గిరిజన తెగలకు ఇందిరమ్మ గృహాలను ప్రారంభించి వారిని గౌరవించారని గుర్తుచేశారు. సభలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రాంతీయ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగిందన్నారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ వంతెనలు, ప్రాజెక్టులను పరిష్కరిస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చారని తెలిపారు.తీవ్ర సమయాభావం వల్ల ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం రాలేదని, అంతేకాని ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదనడం సరికాదని అన్నారు. సభ నిర్వహణ కన్వీనర్‌గా వ్యవహరించిన, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) చైర్మన్ హోదాలో ప్రేమ్ సాగర్ రావు మాత్రమే ప్రసంగించారని పేర్కొన్నారు. ఒక ఆదివాసి మహిళా ఎమ్మెల్యే అయినా కోవలక్ష్మి గారు తనను అవమానపరిచారని ఆరోపించడాన్ని తన విజ్ఞతకే వదిలిపెడుతున్నట్లు శ్యామ్ నాయక్ గారు పేర్కొన్నారు. అలాగే ఉద్యోగాల విషయానికొస్తే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 977 మంది వైద్యులను, 600 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని, ఇతర జిల్లాల కంటే రూ. 50 వేలు అదనపు వేతనం ఇస్తామన్నా ఈ జిల్లాకు వచ్చేందుకు కొందరు ప్రొఫెసర్లు ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ ప్రాంతంపై తమకు కూడా బాధ్యత ఉందని, ఎవరైనా ఇక్కడ విధులు నిర్వహించడానికి ముందుకు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ నిజాం, రాపర్తి మురళి, గజుల జక్కయ్య, మెకార్తి కాశయ్య, గుగ్లోత్ రవి, తాజ్ తదితరులు పాల్గొన్నారు.