కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని దశ్నపూర్ లో అగ్నిప్రమాదం. బూడిదైన రెండు ఇళ్లు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పేద కుటుంబాలు

0
0

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

ఆసిఫాబాద్ (దస్నాపూర్)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైన దాస్నాపూర్ లో బుధవారం అర్ధరాత్రి వేళ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో బండే మానాజీ, బండే సావిత్రి బాయిలకు చెందిన రెండు నివాస గృహాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవ్వగా, అదృష్టవశాత్తూ ఇంట్లో ఉన్న వారందరూ కేవలం కట్టుబట్టలతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఇళ్లలో దాచుకున్న మూడు తులాల బంగారం, ఎనభై తులాల వెండి, లక్షా యాభై వేల రూపాయల నగదుతో పాటు నిత్యావసర సరుకులన్నీ పూర్తిగా కాలి బూడిదవడంతో సుమారు 16లక్షల రూపాయల వరకు భారీ ఆస్తి నష్టం సంభవించిందని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు నష్ట తీవ్రతపై ప్రాథమిక పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక పంపగా, పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై సాంకేతిక విచారణను వేగవంతం చేశారు. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ ఈ పేద కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు మరియు స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.