అమరావతి అసైన్డ్ భూముల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన సీఐడీ కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. పాలకులు మారినప్పుడల్లా రాజకీయ కక్షలతో కేసులు పెట్టే సంస్కృతిని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని స్పష్టం చేసింది. “చట్టం అనేది రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ఆయుధంగా కాకుండా, బలహీనులకు రక్షణ కవచంగా ఉండాలి” అన్న లార్డ్ డెన్నింగ్ సూత్రాలను కోర్టు గుర్తుచేసింది. ఈ కేసు రాజకీయ ప్రతీకారంతో పెట్టినదని పేర్కొంటూ ఆక్షేపించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల నిర్ణయాలకు భద్రత ఉండాలని, లేనిపక్షంలో పాలన స్తంభించిపోతుందని న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.










