తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నూతన షెడ్యూల్ సెప్టెంబర్ 1, 2026 (మంగళవారం) నుంచి అమల్లోకి వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు మారిన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
నూతన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ నుంచి తిరుపతికి నాలుగు సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఉదయం 7:20, 11:15, మధ్యాహ్నం 1:50, రాత్రి 8:20 గంటలకు తిరుపతికి చేరుకుంటాయి. తిరిగి తిరుపతి నుంచి ఉదయం 8:00, 11:45, మధ్యాహ్నం 2:30, రాత్రి 9:00 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతాయి. విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకుని సాయంత్రం 4:00 గంటలకు, ఢిల్లీ నుంచి సాయంత్రం 6:25 గంటలకు చేరుకుని రాత్రి 7:05 గంటలకు తిరిగి వెళ్లే సర్వీసుల సమయాలను కూడా సవరించారు.
ఇతర సర్వీసుల విషయానికొస్తే.. స్టార్ ఎయిర్ విమానం శివమొగ్గ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ విమానం తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతుంది. అదేవిధంగా, ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 5:10 గంటలకు తిరుపతికి చేరుకుని, సాయంత్రం 6:00 గంటలకు తిరిగి హైదరాబాద్కు పయనమవుతుంది. ప్రయాణికులు మారిన సమయాలను గమనించి, ప్రయాణానికి ముందు సంబంధిత విమానయాన సంస్థల ద్వారా వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు కోరారు.










