మహాత్మా జ్యోతిరావ్ పూలే ఓ సంఘసంస్కర్త, విద్యావేత్త అని బడుగుల జీవితాలలో వెలుగులు నింపడానికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన యోధుడని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
దాదాపు 200 సంవత్సరాల క్రితమే ఆనాడు సమాజంలో ఉన్న అనేక వివక్షలపై, మూఢ ఆచారాలపై పోరాడారు. విద్యతోనే సమాజం మారుతుందని బలంగా నమ్మి ప్రతి ఒక్కరికి విద్యను అందించడానికి అనేక పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కూడా పూలే దంపతులకే దక్కుతుందని అన్నారు.
ఆయన సమాజంలో పేరుకు పోయిన కులవివక్ష, అంటరానితనం, మహిళల పట్ల వివక్ష, సతీసహగమనం లాంటి వాటిపై పోరాడారు. ఆయన చేసిన పోరాటాలతో స్పూర్తి పొందిన డా. బిఆర్ అంబేద్కర్ గారు ఆయననే తన గురువుగా ప్రకటించుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.
ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూలే బాటలో నడుస్తూ ఆయన ఆశయసాధన కోసం కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ లాంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ కు చెందిన అనేక మంది నాయకులతో పాటు స్థానిక ప్రజలు పెద్దఎత్తున పాల్గొని మహాత్మా జ్యోతిరావ్ పూలేకు నివాళులు అర్పించారు.