ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్

0
23

సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ తరపున 2000 మంది సిబ్బంది బోనాలు, రంగం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బోనాలతో వచ్చే మహిళలకు మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అందులో బోనాల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత తో పాటు నూతనంగా 40 సీసీ కెమెరాలు కూడా పెంచినట్లు వెల్లడించారు.ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, ఫలహరం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. జూలై 13, 14వ తేదీలలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రజలు రావాలని ఆహ్వానించారు. బోనాలతో వచ్చే మహిళలను పిల్లలను కుటుంబ సభ్యులను బొనాల క్యూ లైన్ లో అనుమతి ఇస్తామని తెలిపారు. బోనాల రోజు బాటా కూడలి నుండి మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల వరకు శివసత్తులు, జోగిని లకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.