మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ లోని మచ్చ బొల్లారం పరిధిలోని తాగునీటి పైప్లైన్లలో గత కొన్ని రోజులుగా లీకేజీ సమస్య తీవ్రరూపం దాల్చింది. పైప్ వాల్వ్ వద్ద బీటలు ఏర్పడడంతో నిరంతరంగా నీరు వృథా అవుతుండటమే కాకుండా, రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. తాగునీటి వృథా కారణంగా భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం లీకవుతున్న నీటిని చూసి మనసు బాధపడుతోంది. పక్కనే బోర్లలో నీరు ఎండిపోతున్నా, ఇక్కడ మాత్రం తాగునీరు వృధా అవుతోంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే స్పందన ఈ సమస్యను స్థానికులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి) అధికారులతో ఫోన్లో మాట్లాడి, రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తాం అని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే రెండు రోజుల తర్వాత అధికారులు చేసిన పనిని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. పైప్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన చోట, అధికారులు చేసిన పని మాత్రం తాత్కాలిక ‘జుగాడ్’గా మారింది. లీకేజీ ప్రాంతంలో వాల్వ్‌ను పూర్తిగా మార్చి కొత్త ఫిట్టింగ్ వేయాల్సిన అవసరం ఉన్నా, అధికారులు మాత్రం వాల్ కు ఎంసిల్ (రబ్బర్ ప్యాచ్) వేసి, పై నుంచి ఒక భారీ బండరాయి పెట్టేసి సమస్యను తప్పించుకున్నట్టు చేశారు.ఇది చూసిన స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,ఇది సమస్య పరిష్కారం కాదు, కేవలం తాత్కాలిక ముసుగు మాత్రమే రెండు రోజులు నీటి సరఫరా ఆపి చివరికి ఇంతేనా చేసిన పని? ఇలాంటివి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. మళ్లీ వాల్వ్ పగిలిపోతే మొత్తం కాలనీ నీటి సరఫరా నిలిచిపోతుంది” అని అన్నారు. ప్రజలు అధికారులను ఉద్దేశించి ఇకపై తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలి. పగిలిన వాల్వ్‌ను పూర్తిగా మార్చి, కొత్త పైప్ ఫిట్టింగ్ చేయాలి. నీటి వనరుల రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. భవిష్యత్తుపై ఆందోళన లీకేజీ కారణంగా నిరంతరం నీరు వృథా అవుతుండటమే కాక, నిల్వ నీటి వల్ల దోమల పెరుగుదల, వ్యాధుల వ్యాప్తి ముప్పు కూడా పెరుగుతుందని వారు హెచ్చరించారు.ఈ సమస్య పరిష్కారం కానట్లయితే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తప్పవు అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుండి మళ్లీ చర్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ విషయంపై మరోసారి స్పందించి, అధికారులకు కఠినంగా ఆదేశాలు జారీ చేస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మచ్చ బొల్లారం తాగునీటి పైప్‌లైన్ లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించాలి.
-sidhumaroju