హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ : గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే. ఈ ఘటనకు సికింద్రాబాద్ నెలవయ్యింది. వివరాలలోకి వెళితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడ్ని నెలకొల్పి వారం రోజుల పాటు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలోనే కృత్రిమ కొలను, షవర్ ను ఏర్పాటు చేసి అందులోనే ఎటువంటి హంగు ఆర్భాటాలు, డీజేలు, బ్యాండ్ మోతలు లేకుండా నిరాడంబరంగా ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేశారు. గణపతి మహారాజ్ కృత్రిమ కొలనులోనే షవర్ బాత్ చేస్తూ అందులో కరిగి పోతుండగా మహిళా ఉద్యోగులు, కార్మికులు కోలాటాలు ఆడుతూ వీడ్కోలు పలికారు.
Sidhumaroju