Home South Zone Telangana లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం

లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా పడే అవకాశం

0

*_ఎన్నికల వాయిదాకే మొగ్గు..!!_* *_స్థానిక ఎన్నికలు రెండుమూడు నెలలు వాయిదా వేసే యోచన_* అందుకోసం హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం! *_రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం రాకపోవటమే ప్రధాన కారణం_* హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఎటూ తేలకపోవడంతో.. వాటిని మరో రెండుమూడు నెలలు వాయిదా వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకోసం హైకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనతోప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను అమలుచేయటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. *_రిజర్వేషన్లు తేలకపోవటంతో.._* స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో ఇటీవల బిల్లు ఆమోదించి గవర్నర్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై గవర్నర్‌ న్యాయ సలహా కోరుతూ న్యాయ నిపుణులకు పంపించినట్లు తెలిసింది. దీంతో బిల్లుపై నిర్ణయం తీసుకోడానికి రాజ్‌భవన్‌కు కొంత సమయం ఇచ్చి వేచిచూడాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ రాజ్‌భవన్‌ నుంచి ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించినా వెంటనే అక్కడి నుంచి ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అందువల్ల మరో రెండుమూడు నెలల తర్వాత బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వెనుకబడిన తరగతుల వారికి స్థానిక సంస్థల్లో విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం ముందుగా బీసీ సంక్షేమ శాఖ జీఓ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వచ్చాక పంచాయతీరాజ్‌ శాఖ రిజర్వేషన్ల ఫార్ములా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల్లో కోటా నిర్ధారణ, ప్రభుత్వపరంగా ఎన్నికల తేదీల నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదంతా పూర్తి కావటానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వపరంగా రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల తేదీల నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికల నిర్వహణ సన్నాహాలను వేగవంతం చేసింది.

Exit mobile version