మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆయన పరామర్శించనున్నారు.
సహాయక చర్యల పురోగతి, ప్రజల అవసరాలు, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో ఆయన పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలపై సమీక్ష జరిపి, అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. కోడూరు, అవనిగడ్డ, నగ్గయ్యపాలెం ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉండటంతో, ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.






