ఆంధ్రప్రదేశ్లో మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఇందులో 11 లక్షల ఎకరాల్లో వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నష్టపోయాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
“రైతులకు అండగా ఉండండి, పంట నష్టం అంచనాలో వారికి మద్దతు ఇవ్వండి” అని జగన్ సూచించారు. “కూటమి ప్రభుత్వం 16 నెలల పాలనలో 16 విపత్తులు ఎదుర్కొంది. కానీ ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు? ఎంతమంది రైతులను ఆదుకున్నారు?” అంటూ జగన్ ప్రశ్నించారు.
ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఆయన అభిప్రాయపడ్డారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేతలు ప్రత్యక్షంగా రైతుల వద్దకు వెళ్లి, ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. తాడేపల్లి కేంద్రంగా జరిగిన ఈ సమీక్షలో 25 జిల్లాల పరిస్థితులపై చర్చ జరిగింది.



