తెలంగాణపై మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సహాయక చర్యల పురోగతి, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పరిస్థితి విషమంగా ఉండటంతో, అక్కడి కలెక్టర్లతో ప్రత్యేకంగా సమీక్ష జరగనుంది.
ప్రభుత్వం తక్షణ సహాయ చర్యలు, నష్టాల అంచనా, పునరావాస చర్యలపై దృష్టి సారించనుంది. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించే అవకాశం ఉంది.






