హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నార్త్‌జోన్ డీసీపీ రష్మి పెరుమాల్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జ్యువెలరీ షాపులు, హై-వాల్యూ ఎలక్ట్రానిక్ గూడ్స్ దుకాణాల యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 50కి పైగా ప్రతినిధులు, ఏసీపీలు, ఎస్‌హెచ్ఓలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. దుకాణాలు తప్పనిసరిగా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ బి ఎన్ఎస్ఎస్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. షాపుల్లో 24 గంటలపాటు పని చేసే సి.సి టీ.వి వ్యవస్థలు, పానిక్ బటన్లు, అలారం సిస్టమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
భారీ మొత్తాల కొనుగోళ్లలో కస్టమర్ వెరిఫికేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఉద్యోగులందరి బ్యాక్‌గ్రౌండ్ చెక్ తప్పనిసరి చేస్తూ, దుకాణాల్లో పనిచేసే సిబ్బంది వివరాలు పూర్తిగా నమోదు చేయాలని ఆదేశించారు.
దొంగతనాల్లో పాల్గొన్న నేరస్తులు పబ్లిక్ ప్రదేశాల్లో చైన్‌స్నాచింగ్ ద్వారా దొంగిలించిన బంగారాన్ని దుకాణాలకు విక్రయించే ప్రయత్నాలు పెరిగాయని డీసీపీ హెచ్చరించారు. దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన షాపుల పై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.
సైబర్ మోసాలు, క్యూ అర్. కోడ్, యూపిఐ ఫ్రాడ్‌ల ద్వారా జరుగుతున్న మోసాలను గుర్తించే విధంగా సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు.
రాత్రి వేళల్లో గార్డులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ స్పష్టం చేశారు. గార్డులు నిద్రపోవడం వంటి నిర్లక్ష్యాలు దుకాణాల భద్రతకు పెద్ద ముప్పు అవుతాయని అన్నారు. షాపుల చుట్టూ ఉన్న బలహీన ప్రాంతాలు, వెనుక గోడలు, వెంటిలేషన్ గ్యాప్‌లు, ఏ.సి ఓపెనింగ్‌ల పై సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి ఎలాంటి లోపాలున్నా వెంటనే సరి చేయాలని ఆదేశించారు.
ఫెస్టివల్ ఆఫర్లు, ప్రత్యేక సేల్స్ లేదా పబ్లిక్ ఆకర్షించే ఈవెంట్లను నిర్వహించే ముందు స్థానిక పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాడిన బంగారం లేదా ఉపయోగించిన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే సమయంలో పూర్తి వెరిఫికేషన్ చేయాలని హెచ్చరించారు.
సమావేశం ముగింపులో, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ దుకాణాల యజమానులు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Sidhumaroju
