నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాను
అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం
పరీక్ష పెట్టే దేవుడు.. వాటిని జయించే శక్తి కూడా ఇస్తాడు
మంగళగిరిలో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్
కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
మంగళగిరి: నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృపాప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. కృపా సమాజం ఆధ్వర్యంలో కృపా ప్రాంగణం పునర్ నిర్మాణం చేసుకుని ప్రారంభించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. దేవుడు ఒక్కోసారి మనకు పరీక్షలు పెడతాడు. వాటిని జయించే శక్తి కూడా ఆ దేవుడే ఇస్తాడు. అలాంటి పరీక్ష మన కృపా సమాజానికి దేవుడు పెట్టాడు. ఆ సమస్యను పరిష్కరించే శక్తి మన పాస్టర్ బేతు వివేక్ గారికి ఆ దేవుడు ఇచ్చాడు. ఆయన సంకల్పంతో సమస్యను పరిష్కరించారు. 7 నెలల్లోనే కృపా ప్రాంగణాన్ని కలిసికట్టుగా పునర్ నిర్మించుకున్నాం. దేవుడి ఆశీస్సులు వల్లే ఇది సాధ్యమైంది.
మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ఉందాం
మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రిస్మస్ మాసం సందర్భంగా మన ఇంటి పక్కన, వీధిలో, గ్రామంలో ఉన్నవారికి సాయపడదాం. ఒక్కరితో అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాజం కలిసివస్తే కలిసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. 2019లో దేవుడు నాకో పరీక్ష పెట్టాడు. దానిని జయించే శక్తి కూడా ఇచ్చాడు. మంగళగిరిలో కమ్యూనిటీ భవనాలను నిర్మించడంతో పాటు స్మశానాలను అభివృద్ధి చేస్తున్నాం. నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని మంత్రి చెప్పారు. అనంతరం క్రిస్మస్ ను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లకు నారా లోకేష్ చేతుల మీదుగా నూతన వస్త్రాలను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ బేతు వివేక్, బేతు ప్రశాంత్, కె.విజయ్, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
