స్థానిక మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ లో ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఎమ్ డి ఫరూఖ్ మాట్లాడుతూ.
క్రైస్తవ సోదరుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవ సోదరుల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలకు కేవలం రూ. 30 వేలు మాత్రమే ఇచ్చేదని, కానీ చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు రూ. 2 లక్షలు కేటాయించి ఈ వేడుకలను పండుగలా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవ సోదరుల ప్రాణ, మాన రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో వేలాది చర్చిల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
గుంటూరులోని ఒక చర్చికి గతంలో రూ. 16 కోట్లు మంజూరు చేస్తే, గత ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా శిథిలావస్థకు చేర్చిందని అన్నారు. ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వం ఆ చర్చిని ఆధునీకరిస్తుందని హామీ ఇచ్చారు. అమరావతి రాజధానిలో క్రైస్తవ, మైనారిటీ సోదరులకు గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని, త్వరలోనే వారి సమస్యలను పరిష్కరించి తగిన సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
చర్చిల వ్యవహారాల్లో గానీ, వాటి ఆస్తిపాస్తుల్లో గానీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటువంటి ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి క్రైస్తవ పెద్దలు, బిషప్‌లు, పాస్టర్లు తమ ఆశీస్సులు అందజేయాలని మంత్రి ఫరూక్ కోరారు.
శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ….. దేవుని పుట్టుకను, ఆయన ఇచ్చిన పవిత్ర గ్రంథం (బైబిల్), అందులోని వాక్యాలను గురించి ఏ విధంగా చర్చిస్తామో… అందులోని ప్రతి పేజీ ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి అనే మార్గాన్ని చూపిస్తుందన్నారు. శాంతి, సహనం, ఓర్పు గురించి కూడా బోధిస్తుందన్నారు. భూమి మీద మీరు, నేను ఉండటం ఎంత నిజమో… ఈ ప్రపంచంలోని మానవాళి అంతా ఆ దేవుని సేవకులు, దేవుని ప్రియులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
దేవుని పుట్టుక ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. జనవరి 1వ తేదీ అనేది కేవలం ఆ దేవుని సేవకులకే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆ దేవుడు పుట్టిన తర్వాత మొదలైన రోజు అని వివరించారు.
శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… క్రిస్మస్ పండుగ ఒక ప్రాంతానికి, జిల్లాకు, ఒక రాష్ట్రానికి,ఒక దేశానికి చెందిన పండుగ కాదని ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని అన్నారు. క్రిస్మస్ దీవెనల ద్వారా దేవుడు మరిన్ని శక్తులు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇవ్వాలని, వారి ద్వారా మరికొంత మంది ప్రజల ఆశీర్వాదాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… అందరికీ సెమీ-క్రిస్మస్, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు..
కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని), శాసన సభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఏ. శేఖర్, మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, బిషప్లు రాజారావు, జయరావు, గోరంట్ల జ్వానీస్, పాస్టర్లు జాన్ వెస్లీ, ఎన్. శామ్యూల్, డేవిడ్ గొర్రె, యేసు రత్నం, సిస్టర్ దానమ్మ, క్రిస్టియన్ కార్యక్రమాల సమన్వయకర్త డాక్టర్ కొడాలి విజయ్ కుమార్, పాస్టర్లు, తదితరులు పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు..
*జారీ చేసిన వారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్*




