ప్రజామన్ననలు పొందిన నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి … సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించారు
దేవినేని ఉమామహేశ్వర రావు
గొల్లపూడి: 25 డిసెంబరు 2025
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.
ఆయన జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, 9 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తోందన్నారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్ పేయి ఎంతో కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయ్ నాంది పలికారు.
ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాదిని వేశాయన్నారు. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా కూడా అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సుపరిపాలన ఏ విధంగా ఉండాలో ఎన్టీఆర్, వాజ్ పేయ్ చూస్తే అర్థమవుతుందన్నారు. నాడు కార్గిల్, అణు పరీక్షలు ఎన్డీయే పాలనలో విజయవంతమైన కార్యక్రమాలుగా చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.




