ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘పీపీపీ’ (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంతో ముందుకెళ్తుండగా, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న హెచ్చరికలు ఈ అంశాన్ని అత్యంత ఆసక్తికరంగా మార్చాయి.
వైద్యం – అగ్నిపరీక్షగా మారిన పీపీపీ నమూనా
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై మొదలైన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. “పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీ పడకూడదు” అన్నది ప్రభుత్వ వాదన అయితే, “ఇది పేదల ఆరోగ్యాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడమే” అనేది వైకాపా ఆరోపణ. ఈ రెండు పరస్పర విరుద్ధ వాదనల మధ్య ఇప్పుడు ‘పీపీపీ’ నమూనా ఒక అగ్నిపరీక్షను ఎదుర్కోబోతోంది.
జగన్ హెచ్చరికలు – పెట్టుబడిదారుల గుబులు
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. పీపీపీ విధానం ద్వారా ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారని, రేపు తమ ప్రభుత్వం రాగానే ఈ ఒప్పందాలపై విచారణ జరిపి బాధ్యులను జైలుకు పంపిస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. సాధారణంగా ఇలాంటి రాజకీయ హెచ్చరికలు ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తాయి.
ముఖ్యంగా 30 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితి గల ఒప్పందాలలో ‘రాజకీయ సుస్థిరత’ చాలా ముఖ్యం. బిడ్డర్లు భయపడితే ఈ ప్రాజెక్టులు కుంటుపడతాయని విపక్షం వేసిన ఎత్తుగడను ప్రభుత్వం ఎలా చిత్తు చేస్తుందన్నదే ఇప్పుడు అసలు సవాలు.
చంద్రబాబు ‘చెక్’: కేంద్రం అండతో ముందడుగు
ప్రతిపక్షం ఇస్తున్న హెచ్చరికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత చాకచక్యంగా ఎదుర్కొంటున్నారు.
ఈ విధానం కేవలం రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగత నిర్ణయం కాదని, ఇది కేంద్ర ప్రభుత్వం (NITI Aayog) రూపొందించిన జాతీయ నమూనా అని ఆయన గట్టిగా వినిపిస్తున్నారు. ముఖ్యంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అనే అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ప్రాజెక్టు ఖర్చులో 60 శాతం నిధులను కేంద్రం, రాష్ట్రం భరిస్తుండటం వల్ల.
ఇది ఒక పక్కా ఆర్థిక ప్రణాళికతో కూడిన చర్యగా ప్రభుత్వం వివరించగలుగుతోంది. ఇప్పటికే కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు విఫలం అయ్యాయి.ఆదోని మెడికల్ కాలేజ్ విషయంలో ఒక సంస్థ ఇప్పటికే ముందుకు రావడం, ఈ భయాలను పోగొట్టే దిశగా ప్రభుత్వం వేసిన మొదటి విజయవంతమైన అడుగుగా భావించవచ్చు.
ఆస్తులు ప్రభుత్వానివే.. నిర్వహణే ప్రైవేటుది.
ప్రభుత్వం చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇక్కడ భూములు గానీ, భవనాలు గానీ ప్రైవేట్ వ్యక్తుల సొంతం కావు. నిర్ణీత కాలం పాటు వారు నిర్వహణ బాధ్యతలు చూస్తారు. 50 శాతం వైద్య సీట్లు ప్రభుత్వ కోటాలోనే ఉండటం, మెజారిటీ పడకలు ఉచిత వైద్యం కోసం కేటాయించడం వంటి అంశాలను ప్రభుత్వం సానుకూల అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే, భవిష్యత్తులో ఈ ప్రైవేట్ సంస్థలు అదనపు ఛార్జీల బాదుడు మొదలుపెడితే ప్రభుత్వం ఏ మేరకు నియంత్రించగలదన్నదే సామాన్యుడిలో ఉన్న అసలు సందేహం.
దానికి ప్రభుత్వం షరతులతో ఒప్పందం చేసుకుని అటు పెట్టుబడిదారులకు, ఇటు ప్రజలకు నష్టం కలగని రీతిలో న్యాయ రక్షణ కల్పించే వెసులుబాటును సిద్ధం చేసే ఆస్కారం ఉంది.
గత జ్ఞాపకాలు – భవిష్యత్తు సవాళ్లు
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగం ఇప్పుడు ఒక చారిత్రక మలుపులో ఉంది. ఒకవైపు జగన్ “జైలు” హెచ్చరికలు, మరోవైపు చంద్రబాబు “ప్రపంచ స్థాయి వైద్యం” నినాదం. గతంలో విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఒప్పందాల రద్దుకు తెగబడి, వేలాది కోట్ల రాష్ట్ర ప్రజల ధనాన్ని కోర్టు తీర్పుల ద్వారా వృధా చేసి.
వాటిని సామాన్య జనానికి విద్యుత్ బిల్లుల రూపంలో భారం మోపిన చేదు జ్ఞాపకాలను ప్రజలు తలచుకుంటున్నారు.
ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వైద్యం విషయంలో జగన్ ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తూ.. తన సొంత నియోజకవర్గం పులివెందుల నుండి వచ్చే పీపీపీ మెడికల్ కాలేజీలకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తన హెచ్చరికల వల్ల ప్రాజెక్టులు ఆలస్యమైతే, దానికి రాజకీయంగా ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. రాజకీయ పంతాల కంటే ప్రజారోగ్యమే పరమావధిగా ఈ ప్రాజెక్టులు సాగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
