Home South Zone Andhra Pradesh మిలియన్‌ ప్లస్‌ సిటీగా గుంటూరు.. 18 గ్రామాల విలీనానికి కౌన్సిల్ ఆమోదం.

మిలియన్‌ ప్లస్‌ సిటీగా గుంటూరు.. 18 గ్రామాల విలీనానికి కౌన్సిల్ ఆమోదం.

0

గుంటూరు నగరాన్ని మిలియన్ ప్లస్ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మిలియన్ ప్లస్ నగరాలుగా విశాఖపట్నం, విజయవాడ మాత్రమే ఉండగా, ఇప్పుడీ జాబితాలోకి గుంటూరు కూడా చేరనుంది. 18 గ్రామాలను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ)లో విలీనం చేసేందుకుగాను, కౌన్సిల్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, గుంటూరు నగరం 10 లక్షల జనాభాను దాటి మిలియన్‌ ప్లస్‌ సిటీగా అవతరిస్తుంది. మిలియన్ ప్లస్ సిటీగా మారడం వల్ల, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రత్యేక పథకాలు, భారీ ఎత్తున నిధులు గుంటూరుకు లభించనున్నాయి.

అయితే, కొందరు సభ్యులు ఈ విలీన ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల విలీనం వల్ల నిర్వహణపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరత ఉందని, జీఎంసీపై భారం పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని తూర్పు ఎమ్మెల్యే నసీర్ సూచించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో మూడు రోజులే గడువు ఉంది.
పైగా ఈ విలీన ప్రక్రియ ఆఖరి క్షణాల్లో హడావుడిగా జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సంవత్సరం పొడవునా ఈ అంశాన్ని పట్టించుకోకుండా, చివరి నిమిషంలో గ్రామాల విలీనంపై దృష్టి సారించడంపై విమర్శలున్నాయి. జీఎంసీ అధికారులు మూడు నెలల క్రితమే డీపీవోకు లేఖ రాసి, డిసెంబర్ 31 తుది గడువు అని చెప్పినా, ఈ నెల మొదట్లో ప్రత్యుత్తరం రావడంతోనే చర్చ మొదలైంది.

ఇప్పటివరకు జొన్నలగడ్డ, గొర్లవారిపాలెం, తోకవారిపాలెం, దాసుపాలెం, మల్లవరం, చినపలకలూరు, తురకపాలెం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, ఓబులనాయుడుపాలెం, లాల్‌పురం గ్రామాల్లో గ్రామసభలు తీర్మానాలు చేశాయి. లామ్, కొర్నిపాడు, పుల్లడిగుంట, తక్కెళ్లపాడు, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని గ్రామాల్లో ఎమ్మెల్యేల ఆమోదం, పంచాయతీల తీర్మానం జరగాల్సి ఉంది.

విలీనం వల్ల ప్రయోజనాలు:
కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రత్యేక పథకాలు, నిధులు లభించనున్నాయి.
భవిష్యత్తులో స్మార్ట్‌సిటీ నగరాల జాబితాలో చేరే అవకాశం ఉంది.
విలీన గ్రామాల పరిధిలో దాదాపు 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిపై కేంద్ర, రాష్ట్ర సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలోనే రాజధాని అమరావతి రూపుదిద్దుకోవడం, విలీన గ్రామాల పరిసరాల్లో ఓఆర్‌ఆర్‌ (ఔటర్ రింగ్ రోడ్) వెళ్లడం కూడా కలిసొచ్చే అంశాలు.
జీఎంసీలో అదనపు కమిషనర్ పోస్టుతో పాటు మరికొన్ని విభాగాలు, పోస్టులు మంజూరవుతాయి.
సర్కిళ్లు, జోన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని శనివారం కౌన్సిల్ సమావేశంలో సభ్యులకు వివరించారు.

NO COMMENTS

Exit mobile version