బాధితునికి నిత్యావసర సరుకులు, రూ.6 వేల ఆర్థిక సాయం అందజేత*
మంగళగిరి:
గత రెండున్నరేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన ఓ బాధితునికి మంగళగిరి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు డోకిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేయూతనందించారు.
*చేతులెత్తి మొక్కుతున్నా.. చేయూతనివ్వరూ..
శీర్షికన ఈనెల 19వ తేదీన నేటి దినపత్రిక సూర్య జిల్లా టాబ్లాయిడ్ లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు డోకిపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మిత్ర బృందం సోమవారం మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కాజ లోని బాధితుడు మోదుగుల వెంకట్రావు నివాసానికి చేరుకొని పరామర్శించి నిత్యావసర సరుకులతో పాటు రూ.6వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు డోకిపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ… బాధితుడు వెంకట్రావు గత రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం కావడం ఎంతో బాధాకరమన్నారు. బాధితునికి తమ వంతు సాయంగా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, రూ. ఆరు వేల ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు.
మరింతమంది మానవతావాదులు ముందుకు వచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బాధితుడు వెంకట్రావుకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బర్మా శ్రీనివాసరావు, నక్కా లక్ష్మణ్, మురుగుడు మదన్ మోహన్, మద్దాల రమేష్, చెన్నం శెట్టి సతీష్, షేక్ ఖైరుల్లా, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
