వైద్య సిబ్బంది, ప్రజల తీరు మారాలి*
*ఆరోగ్య భద్రత నవ సంవత్సరంలో సంకల్పం కావాలి*
*వైద్య సిబ్బంది, రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు*
సమగ్ర ప్రజారోగ్య భద్రత సాధనకు వైద్యులు, ఇతర సిబ్బంది తీరు మారాలని, దీంతో పాటు ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలిలో సమగ్ర మార్పు రావాలని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ దిశగా అందరూ నూతన సంవత్సరం సందర్భంగా సంకల్పం తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బందికి, రాష్ట్ర ప్రజలకు మంత్రి నూతన శుభాకాంక్షలు తెలిపారు.
*ప్రజల బాధ్యత*
ప్రజారోగ్య పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఈ లక్ష్య సాధనకు ప్రజల పూర్తి భాగస్వామ్యం కీలకమని మంగళవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, నివాస ప్రాంతాల్లో పారిశుధ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని మంత్రి కోరారు. వేగంగా విస్తరిస్తున్న మధుమేహం(బ్లడ్ షుగర్).
రక్తపోటు(బ్లడ్ ప్రెషర్), క్యాన్సర్ వంటి అసంక్రమణ(నాన్ కమ్యునకబుల్ డిసీజెస్) వ్యాధులకు అరికట్టడానికి ప్రజల జీవన విధానంలో సమగ్ర మార్పుల అవసరాన్ని మంత్రి నొక్కివక్కాణించారు. ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం, యోగా మరియు ధ్యానం ప్రక్రియల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రజలు దృష్టి పెట్టాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
డయేరియా, విషజ్వరాలు వంటి సంక్రమణ వ్యాధులు(కమ్యునకబుల్ డిసీజెస్) నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం ఎంతో ప్రధానమని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ విషయాల్లో ప్రజలు ప్రజల నిర్లక్ష్యం, అజాగ్రత్త వలన ప్రభుత్వ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
*వైద్యులు, సిబ్బంది పాత్ర*
ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు, ఇతర సిబ్బంది విధుల నిర్వహణలో వెల్లడవుతున్న కొన్ని లోపాల పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, ఆశించిన ఫలితాలు రావాలంటే వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది దృక్పథాల్లో మార్పులు రావాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
గత 19 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలతో కొంత మార్పు స్పష్టంగా వచ్చిందని, ఈ మార్పును మరింత విస్తృతంగా, లోతుగా సాధించాలని మంత్రి అభిప్రాయపడ్డారు.
వైద్యులు, ఇతర సిబ్బంది రోగుల పట్ల సానుభూతి, సంవేదనతో వ్యవహరించాలని, వ్యాధులబారిన పడిన రోగుల ముఖాల్లో చిరునవ్వే వారి లక్ష్యం కావాలని, రోగులకు సేవచేయడం తమకు లభించిన ఒక మహత్తర అవకాశంగా భావించాలని మంత్రి సూచించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకనుగుణంగా అందరూ సమిష్టి కృషి చేయాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
