మనకి మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. (ఒక సంవత్సరంలో 24 + అధిక మాసంలో 2. వీటి అన్నిటిలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకం.
ధనుర్మాసంలో (డిసెంబరు 16 నుంచి జనవరి 14 వరకు) వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అనీ, ముక్కోటి దేవతలు తిరిగే తిథి కనుక ముక్కోటి ఏకాదశి అనీ, పరమైకాదశి అనీ, సాక్షాత్తూ విష్ణు స్వరూపం కనుక కృష్ణ ఏకాదశి అనీ అంటారు. నారాయణుడు పాలసముద్రంలో కార్తీకమాసం శుక్ల పక్ష ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. లేచాక మార్గశిర శుక్ల ఏకాదశి వరకు లోక పోషణ కొరకు సంచారం చేస్తాడు.
ఆ సమయంలో ఆయనని ఆరాధించి, ఉపాసన చేసిన వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి, ఒక రూపం ధరించి వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి 7 ద్వారాలు తెరుచుకుని బయటకు వస్తాడు. అలా లోక రక్షణ కొరకు బయటకు వచ్చే తిథి కనుకే వైకుంఠ ఏకాదశి అని అంటారు.
ఉపవాసం చేయగలగిన వారు ఉపవాసం చేయాలి, అసలు ఏమి తినకుండ ఉపవాసం చేయరాదు. అది నిరాహార దీక్ష కింద లెక్క. కనుక ఈ శరీరం నిలబడడానికి ఆహారం అవసరం అయినంత మాత్రమే (అనగా పళ్లు, పాలు వంటివి) తిని ఆ రోజంతా ఆ విష్ణు నామస్మరణ,శివ నామస్మరణ చేసుకోవాలి.
జాగరణ చేయగలగినవారు జాగరణ చేయడం చాలా మంచిది. జాగరణ అనగా కునుకు వేయకుండా ఆ భగవన్నామస్మరణ చేస్తూ గడపాలి.
పూర్తిగాజాగారం చేయలేని వారు కనీసం రాత్రి12 గంటలవరకు ఉండి కూడా పూర్తిగా జాగరణ చేసిన ఫలితం వస్తుంది.
ఈ రోజున బంగారం దానంచేస్తే గొప్ప కీర్తి వస్తుంది. వెండి దానం చేసిన వారి వంశం వృధ్ధి చెందుతుంది.
భూదానం చేస్తే దివ్య విమానం ఎక్కి వైకుంఠం చేరుకుంటారు. ఇవేమీ చేయలేని వారు ఒక బ్రాహ్మణ కుటుంబం తినడానికి సరిపోయేలా స్వయంపాకం ఇవ్వాలి.
ఉత్తర ద్వార దర్శనం చాలా ముఖ్యమైనది, ఈరోజున ఆ విష్ణువు ఉత్తర ద్వారం గుండా వచ్చి దేవతలను, ఆయనని నమ్మి ఉపాసన చేసిన వారిని రక్షిస్తాడు. ఉత్తర దిక్కు దేవతల స్థానం. దేవాలయంలో ఈ రోజున ఉత్తరద్వారం నుండి వెళ్ళి విష్ణు దర్శనం చేయడం వలన ఇహలోకంలో ఋణ విముక్తి, భూ అభివృద్ధి అవుతుంది.
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. కుటుంబం అభివృద్ధి అవుతుంది. మోక్షం వస్తుంది.
ఒకవేళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే విష్ణు శ్రీలలిత, శ్రీకృష్ణ, గణపతి, శివ సహస్ర నామాలలో ఏదైనా భక్తితో పారాయణ చేసుకోవాలి. అలా చేస్తే అన్ని దోషాలు తొలగుతాయి.
