ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 31, 2025*
*పింఛను.. సరికొత్తగా చేతికందెను..*
– *నూతన ఏడాది ప్రారంభం నాటికే పేదల చేతిలో పింఛను మొత్తం*
– *పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్‌టీఆర్ భరోసా*
– *పటిష్ట పర్యవేక్షణ, సమన్వయంతో సజావుగా పెన్షన్ల పంపిణీ*
– *పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
పేదలకు ఎన్‌టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతోపాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని.. పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం నూతన ఏడాది ప్రారంభం నాటికే లబ్ధిదారుల చేతికందిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఎన్‌టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలో లెనిన్ సెంటర్ ప్రాంతంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం సరైనవిధంగా అందుతుందా..
లేదా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సామాజిక భద్రత పెన్షన్ మొత్తం చేతికి అందుకున్న వేళ ఓ అమ్మ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వ సహాయం తనకు కొండంత ధైర్యం ఇస్తోందనే భావన ఆమె చిరునవ్వులో కనిపించింది. ఆ పింఛను మొత్తమే తన గౌరవప్రద జీవనానికి పెద్ద అండనే భరోసా కనిపించింది.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రారంభం నాటికే లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 31నే పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల కింద కొత్త వాటితో కలుపుకొని 2,28,592 పెన్షన్లకు దాదాపు రూ. 98.95 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని..
క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషిచేశారన్నారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని, అందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
