అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలను జయప్రదం చేయండి*
– *సమాఖ్య వైస్ చైర్మన్, ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్*
మహారాష్ట్రలోని షిర్డీలో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు.
విజయవాడ గాంధీనగర్ లోని ఎన్జీవో హోంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎ.విద్యాసాగర్.. జాతీయ ప్రతినిధులు, రాష్ట్ర ఎన్జీజీవో సంఘ నాయకులతో కలిసి మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సమాఖ్య దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 80 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు నేతృత్వం వహిస్తోందన్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,200 మంది ప్రతినిధులు హాజరవుతారని, వివిధ దేశాల నుంచి కూడా ఆత్మీయ అతిథులుగా వివిధ సమాఖ్యలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరవుతారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 55 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందని తెలిపారు.
స్థానిక మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగే మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సిపిఎస్ అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వివిధ రాష్ట్రాలలో ఉన్న వేతన సవరణ సమస్యలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల మీద చర్చ, అంతర్జాతీయంగా జరుగుతున్న వివిధ పరిణామాలపై సమావేశాల్లో చర్చించి, పలు తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు.
అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు సుభాష్ లాంబా, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ నేతృత్వంలో ఈ జాతీయ సమావేశాల నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలోనే మహిళా ప్రతినిధులకు ప్రత్యేకమైన సెషన్స్ జరుగుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న విషయంపై ఒక రోజంతా చర్చ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గానికి కూడా ఈ నెల 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
ఎన్నికల్లో జాతీయ ఉపాధ్యక్షుడిగా తిరిగి పోటీచేస్తున్నట్లు ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు.
కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, ఏఐఎస్జిఈఎఫ్ సబ్ కమిటీ మహిళా కార్యదర్శి రాజ్యలక్ష్మి, ఎన్జీవో సంఘ రాష్ట్ర నాయకులు జగదీశ్వరరావు, భారతీ ప్రసాద్, జానకి, శివప్రసాద్, సుబ్బారెడ్డి, క్యాపిటల్ సిటీ అధ్యక్షులు నాగభూషణం, సరస్వతి, ఎన్జీవో సంఘ ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు డి.సత్యనారాయణ రెడ్డి, పి.రమేష్, విజయవాడ నగర శాఖ అధ్యక్షకార్యదర్శులు సివిఆర్ ప్రసాద్, ఎస్‌కే నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
(ఏపీ ఎన్‌జీజీవో కార్యాలయం, విజయవాడ ద్వారా జారీ)
