రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి
టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ (గొల్లపూడి) : 11 జనవరి 2026
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని నిర్వహించిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను పురస్కరించుకొని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు.
గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ విశ్వకర్మ, వాల్మీకి, కనకదాస జయంతులను ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు.
అదే తరహాలో మరో బీసీ ముద్దు బిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని కూడా రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో వడ్డే ఓబన్న జన్మించారని తెలిపారు.
శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయని వివరించారు. ఈ ఉద్యమంలో నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం విశేష ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు.
బ్రిటీష్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొని వడ్డే ఓబన్నకు ఘన నివాళులు అర్పించారు.
