అనంతపురం: ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సురక్ష వాహనం ద్వారా అవగాహన సదస్సులు
సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం
జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాలలో ఇరుక్కుపోకుండా ఉండేందుకు ప్రజలలో అవగాహన తేవడం ముఖ్యమని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు సంకల్పించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ సైబర్ నేరాల అనర్థాలపై చైతన్యం తీసుకురావడానికి సురక్ష డిజిటల్ డిస్ప్లే వాహనాన్ని రంగంలోకి దింపారు. సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా అదానీ గ్రూప్ వారి సహకారంతో 2025 ఏప్రిల్ 17న ప్రారంభించిన డిజిటల్ డిస్‌ప్లే అవగాహన వాహనం ద్వారా సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుర్వినియోగం, మహిళలపై నేరాలు, రోడ్డు భద్రత వంటి కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అధునాతన ఎల్‌ఈడీ స్క్రీన్లు మరియు ఆడియో-విజువల్ సాంకేతికతతో కూడిన ఈ వాహనం ద్వారా గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజా ప్రదేశాలు మరియు రద్దీ ప్రాంతాల్లో ప్రభావవంతమైన సందేశాలు ప్రసారం చేస్తున్నారు.
ఈ డిజిటల్ డిస్‌ప్లే అవగాహన వాహనం (సురక్ష వాహనం) క్యాంపెయిన్ ద్వారా ఇప్పటివరకు 38 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 760 గ్రామాలు కవర్ చేశారు. సుమారు 7,60,000 మంది ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే …228 పాఠశాలలు మరియు 152 కళాశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా సుమారు 5,00,000 మంది విద్యార్థులను చేరుకున్నారు. అదేవిధంగా 15 పట్టణాలలో ఈ కార్యక్రమం ద్వారా సుమారు 45,000 మంది ప్రజలకు చైతన్యం కల్పించబడింది.
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, నకిలీ కాల్స్/సందేశాలు, గుర్తింపు దొంగతనం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ, వ్యక్తిగత సమాచార భద్రత, సురక్షిత డిజిటల్ చెల్లింపులు, సైబర్ నేరాలపై 1930 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాల్సిన విధానాన్ని వివరించారు.
మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహనలో మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలను వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాల్సిన ప్రారంభ లక్షణాలు, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచే చర్యలు, కౌన్సెలింగ్ మరియు పునరావాసంపై దృష్టి సారించారు.
మహిళలపై నేరాల నియంత్రణపై మహిళల చట్టపరమైన హక్కులు, సహాయ వ్యవస్థలపై అవగాహన కల్పిస్తూ, వేధింపులు, గృహ హింస, వెంటాడటం వంటి ఘటనలను వెంటనే పోలీసులకు లేదా హెల్ప్‌లైన్లకు తెలియజేయాలని సూచించారు.
రోడ్డు భద్రతపై అవగాహనలో హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడపరాదని, పాదచారుల భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటన ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ప్రజలకు వివరించారు.
