Home South Zone Andhra Pradesh Chandrababu Naidu: ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ఏపీకి అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ఏపీకి అగ్రస్థానం: సీఎం చంద్రబాబు

0

Chandrababu Naidu AP to Become Global Clean Energy Hub
కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పనులు ప్రారంభం
ఏపీని దేశపు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న సీఎం
ఇది రూ.83,000 కోట్లతో చేపడుతున్న సమీకృత ప్రాజెక్టు అని వెల్లడి
ఇక్కడి గ్రీన్ అమ్మోనియాను జర్మనీ, ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నారు

ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ఆయన ప్రకటించారు. కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు పరికరాల ఏర్పాటు కార్యక్రమం శనివారం ప్రారంభమైందని తెలిపారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని ముఖ్యమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

2024 అక్టోబర్‌లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ ఫలాలను ఇస్తోందని, ఆనాడు తామిచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం గర్వకారణమైన మైలురాయి అని చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83,000 కోట్లు) సమీకృత పెట్టుబడి వస్తోందని వివరించారు. ఈ పెట్టుబడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనే 7.5 గిగావాట్ల సౌర, పవన విద్యుత్ సామర్థ్యం, 1 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్లాంట్లు కూడా ఏర్పాటవుతాయని తెలిపారు. ఇది రాష్ట్రంలో ఉన్న సమగ్రమైన క్లీన్ ఎనర్జీ వ్యవస్థకు నిదర్శనమని అన్నారు.

ప్రపంచంలోనే ఈ తరహా ప్రాజెక్టు ఇదే మొదటిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీతో పాటు ఇతర ప్రపంచ దేశాల మార్కెట్లకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, పారిశ్రామిక అనుకూల వాతావరణం వల్లే ఇలాంటి చరిత్రాత్మక ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చంద్రబాబు తన ప్రకటనలో వివరించారు.

NO COMMENTS

Exit mobile version