స్విస్ తో వాణిజ్య సంబంధాల బలోపేతానికి సహకరించండి*
ఏపీలో పెట్టుబడులకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించండి*
స్విస్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో మంత్రి లోకేష్ భేటీ*
జ్యురిచ్ (స్విట్జర్లాండ్): స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… స్విట్జర్లాండ్ తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని చెప్పారు.
ఇందుకోసం స్విస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. టెక్నాలజీ, టెక్స్ టైల్, యంత్రాల తయారీ, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, ఆర్ అండ్ డి సెంటర్స్, విశ్వవిద్యాలయాలతో సహకారం వంటి రంగాల్లో మేం స్విస్ సహకారాన్ని కోరుకుంటున్నాం. నెస్లే, రోచె, నోవార్టిస్, ఎబీబీ, లైబెర్ ఇంజనీరింగ్, క్లారియంట్, హిల్టి, బుహ్లర్, బుచర్ఫె.
ర్రింగ్ ఫార్మాస్యూటికల్స్, ఎస్ టీ టెలిమీడియా, ఓసీ ఓర్లికాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పేలా ప్రోత్సహించండి. స్విస్ లోని జ్యురిచ్ విశ్వవిద్యాలయం, బాసెల్ యూనివర్సిటీ, బెర్న్ యూనివర్సిటీ, జెనీవా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వర్సిటీలను ఏఐ, ఫార్మా, మెడికల్ డివైస్, స్టార్టప్, ఎక్స్చేంజి ప్రోగ్రామ్ లపై ఏపీ వర్సిటీలను అనుసంధానించడంలో మద్దతు ఇవ్వండి.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు డయాస్పోరా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతోంది. స్విట్జర్లాండ్లో భారతదేశ సాంకేతిక ప్రతిభకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది సాంకేతిక నిపుణులను స్విట్జర్లాండ్ కు పంపడానికి సహకారం అందించండి. తెలుగు డయాస్పోరాకు చెందిన ఔత్సాహికులను ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉంది.
దీనివల్ల దేశాభివృద్ధికి అవకాశమేర్పడుతుంది. ఇందుకు మీవంతు సహకారం అందించండి. గతంలో చాలామంది విద్యావంతులు యూఎస్ వెళ్లి అక్కడ వివిధరంగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం యూరప్ కు కూడా విద్యార్థులు పెద్దఎత్తున వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి స్విట్జర్లాండ్ కు వచ్చే విద్యార్థులకు అవసరమైన సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్విస్ లోని భారత రాయబారి మృదుల్ కుమార్ స్పందిస్తూ… గత ఏడాది అక్టోబర్ 1న భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ ల్యాండ్, లీచెన్ స్టెయిన్)ల మధ్య జరిగిన చరిత్రాత్మక ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ (TEPA)తో ఇరు ప్రాంతాల నడుమ వాణిజ్య సంబంధాలు నవశకంలోకి ప్రవేశించాయి. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15ఏళ్లలో భారత్ లో $బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ దేశాలు తమ కమిట్ మెంట్ ను వ్యక్తంచేశాయి. భారత్ లో 10లక్షల మంది యువతకు ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవకు తమవంతు సహకారం అందిస్తానని మృదుల్ కుమార్ పేర్కొన్నారు.
