బండ్ల గణేష్.. ఇది పేరు కాదు.. ఓ బ్రాండ్
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు శివాజీ
బండ్ల గణేష్.. ఇది ఒక పేరు మాత్రమే కాదు..ఒక బ్రాండ్.. తాను ఏది చేసినా సంచలనమే.. అంటూ సినీ నటుడు శివాజీ బండ్ల గణేష్ ను కొనియాడారు. సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బండ్ల గణేష్ తో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు తొలి సినిమా అవకాశాన్ని నాగార్జున గారు ఇస్తే, మాస్టర్ అనే చిరంజీవి గారి సినిమా ద్వారా తాను సినీ రంగానికి పరిచయం అయ్యానని.
ఆ తర్వాత నిరంతరం తన వెన్నంటే నిలిచి ఈ రంగంలో ముందుకు సాగేలా ప్రోత్సహించిన వ్యక్తి బండ్ల గణేష్ అని అన్నారు. ఇంటికి అద్దె కూడా కట్టలేని తరుణంలో సెల్ఫోన్ లేని కాలంలో తనకు పేజర్ ఇచ్చి నిరంతరం తనకు అందుబాటులో ఉండేవాడని అన్నారు.
చిన్న నటుడుగా ప్రారంభమై ఆయన ఎదిగిన తీరు ఒక చరిత్ర అని అన్నారు. ఎంతోమందికి ఆస్తులు కూడగట్టి, మరి ఎంతోమందికి అవకాశాలు ఇచ్చి, ఇంకెంతో మందికి సాయం చేసిన గొప్ప గుణం బండ్ల గణేష్ కు ఉందన్నారు. మాటలు అందరూ చెబుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వ్యక్తి ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడుతో ఆయనకు ఎలాంటి లాభం లేకపోయినా ఒక మహా నాయకుడిని అరెస్టు చేయడాన్ని దారుణంగా పరిగణించి చిన్న చుక్కల మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఒక మహా సముద్రం లా మార్చాడని అభినందించారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనస్తత్వం ఆయనదని.
ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును నిర్భయంగా ఒప్పుకునే నిజాయితీ కూడా అతనిలో ఉందని ప్రశంసించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, ఇలాంటి వ్యక్తి తనకు స్నేహితుడిగా మారడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆయన సంకల్పయాత్ర ఇప్పుడు చిన్న కాలువల మొదలైందని, ఇదే ముందు ముందు సముద్రంలో మారుతుందని అన్నారు. ఈ యాత్రకు తాను కూడా వస్తానంటే ప్రారంభోత్సవానికి వస్తే చాలని అన్నాడని చమత్కరించారు. సంకల్పయాత్ర మొదలుపెట్టిన ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.. *KP*
