కర్నూలు : డోన్ :
డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల సమర్థ నిర్వహణకు కీలకమైన చర్య ప్రారంభమైంది. ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన నూతన “స్వచ్ఛ రథం” వాహనాన్ని డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ “తుక్కు ఇవ్వండి…
సరకులు తీసుకోండి” అనే నినాదంతో ఈ స్వచ్ఛ రథం ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంది. ప్రజలు తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను అందిస్తే, వాటి బదులుగా నిత్యావసర సరుకులను రథం సిబ్బంది అందజేస్తారు. సేకరించిన వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపడం ద్వారా పర్యావరణ సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడనుంది అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే దుష్ప్రభావాలను తగ్గించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజల చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థాల సరైన నిర్వహణ తప్పనిసరిగా అమలు చేయాలని ఎమ్మెల్యే గారు తెలిపారు .
ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో శుభ్రత మరింత మెరుగుపడటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా గణనీయమైన తోడ్పాటు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
