Home South Zone Andhra Pradesh చంద్రబాబు నాయుడు మోదీకి “మన్ కీ బాత్” ధన్యవాదాలు

చంద్రబాబు నాయుడు మోదీకి “మన్ కీ బాత్” ధన్యవాదాలు

0

‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ
జల వనరుల పునరుద్ధరణలో వారి కృషి అభినందనీయమన్న ప్రధాని
ప్రధాని ప్రశంసలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
జల భద్రత తమ స్వర్ణాంధ్ర విజన్‌లో భాగమని స్పష్టం చేసిన సీఎం
ఈ ప్రశంసలు తమకు మరింత ప్రేరణ ఇస్తాయని చంద్రబాబు వెల్లడి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రజల కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి, వారిని కొనియాడారు. జల సంరక్షణ కోసం వారు చేస్తున్న స్ఫూర్తిదాయక ప్రయత్నాలను అభినందించారు. ప్రధాని ప్రశంసలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జల వనరుల పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రజలు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం” అని అన్నారు. వారి నిబద్ధతను, సామూహిక ప్రయత్నాలను కొనియాడారు. కరవు పీడిత ప్రాంతంలో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ప్రధాని ప్రశంసలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. “గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ, అనంతపురం ప్రజల స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను మీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు” అని చంద్రబాబు పేర్కొన్నారు. జల భద్రత అనేది తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర విజన్’లో పొందుపరిచిన ‘పది సూత్రాలలో’ ఒక కీలకమైన అంశమని ఆయన గుర్తుచేశారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతులను సమర్థంగా అనుసంధానం చేస్తూ, రాష్ట్రంలో బలమైన జల సంరక్షణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చిన ఈ ప్రశంస మరింత ప్రేరణను, ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన వివరించారు. జల సంరక్షణ వంటి కీలకమైన అంశంపై ప్రధాని దృష్టి సారించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. కరవు నివారణకు తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇది మరింత బలాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు.

NO COMMENTS

Exit mobile version