Home South Zone Andhra Pradesh మేజర్ మల్లా రామ్‌గోపాల్ నాయుడుకు ఏపీ సన్మానం |

మేజర్ మల్లా రామ్‌గోపాల్ నాయుడుకు ఏపీ సన్మానం |

0

కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన మేజర్ నాయుడు
కశ్మీర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టి, సహచరులను కాపాడినందుకు ఈ పురస్కారం
2024 స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ఆయనకు కీర్తిచక్ర ప్రకటించిన కేంద్రం
కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ ప్రభుత్వం భారీ నగదు బహుమతి ప్రకటించింది. ఆయనకు రూ.1.25 కోట్లు అందిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు. మేజర్ రామ్‌గోపాల్‌నాయుడు స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామం.

2023 అక్టోబర్‌ 26న జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో మేజర్ రామ్‌గోపాల్ నాయుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ప్రాణాలకు తెగించి ఉగ్రవాదులతో పోరాడి, తన సహచర సైనికుల ప్రాణాలను కాపాడారు. ఆయన వీరత్వానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.

కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో రామ్‌గోపాల్ నాయుడు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. స్థానిక ఇళ్లలో దాక్కున్న ఐదుగురు ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపగా, మేజర్ రామ్‌గోపాల్ ఏమాత్రం వెనకాడకుండా ఎదురుదాడికి దిగారు. అత్యంత సమీపం నుంచి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది గ్రెనేడ్ విసరగా, చాకచక్యంగా తప్పించుకుని అతడిని కూడా హతమార్చారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

సాయుధ బలగాల్లో ‘చక్ర’ అవార్డులు పొందిన వారికి నగదు బహుమతులు అందించాలన్న ప్రభుత్వ విధానంలో భాగంగా ఏపీ సర్కార్ ఈ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. శౌర్య పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు మేజర్‌గా ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు.# పి వెంకటేష్

NO COMMENTS

Exit mobile version