మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తూ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ₹80.47 కోట్ల భారీ నిధులతో నేరేడుమెట్, వాజ్ పేయి నగర్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (RUB) మరియు సఫిల్ గూడా వద్ద సబ్వే (LHS) నిర్మాణ పనులకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఘనంగా శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వాజపేయి నగర్ RUB నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది. కేవలం హామీలు ఇవ్వడం కాదు ఫలితాలు చూపడమే మా లక్ష్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఈ ప్రాజెక్టుల కోసం భూసేకరణ మరియు ఇతర సాంకేతిక ఇబ్బందులు కలగకుండా స్థానిక యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.
అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజలు రైల్వే గేట్ల వద్ద పడుతున్న ఇబ్బందులను గమనించి కేంద్రం నుండి ఈ నిధులు మంజూరు చేయించా. వాజపేయి నగర్ RUB మరియు సఫిల్ గూడ సబ్వే పనులు పూర్తి అయితే లక్షలాదిమంది ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుండి విముక్తి లభిస్తుంది. నాణ్యతతో, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా రైల్వే అధికారులకు ఇచ్చామని అన్నారు.
అట్టహాసంగా నేరడ్ మెట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM) ఆర్. గోపాలకృష్ణ ప్రాజెక్ట్ మ్యాపును ప్రజాప్రతినిధులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, రాజ్యలక్ష్మి, శ్రవణ్ కుమార్, మీనా ఉపేందర్ రెడ్డి, సునీత శేఖర్ యాదవ్, దీపికా నరేష్, చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత యాదవ్, మరియు ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, నేరేడుమెట్, ఆనంద్ బాగ్,సఫిల్ గూడ, మల్కాజిగిరి పరిసర కాలనీ ప్రాంతాల ప్రజల ప్రయాణ సమయం ఘననీయంగా తగ్గుతుంది.
గతంలో అల్వాల్ లో జరిగిన రైల్వే ఆర్ యు బి శంకుస్థాపన సమయంలో బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల ఘర్షణను దృష్టిలో ఉంచుకుని , ఈ కార్యక్రమానికి రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
#sidhumaroju
