Home South Zone Andhra Pradesh NEW AIRPORTS IN AP

NEW AIRPORTS IN AP

0

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన
అధ్యయనం చేయాలని ఏఏఐని కోరినట్లు తెలిపిన కేంద్ర మంత్రి
పరిశీలనలో ఉన్న కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కార్గో టెర్మినల్ సామర్థ్యం వినియోగం కావట్లేదని వెల్లడి
ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మోహోల్‌ సమాధానమిచ్చారు. ఈ నెలలోనే ఏపీ ప్రభుత్వం నుంచి ఈ అభ్యర్థన అందిందని, విమానాశ్రయానికి అవసరమైన స్థల వివరాలను కూడా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు అందజేసిందని ఆయన వివరించారు.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని మరో మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఏఏఐ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందన్నారు. ఈ మూడు విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌’ విధానం కింద పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదనలు పంపిందని, అవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని మురళీధర్ మోహోల్ పేర్కొన్నారు.

మరోవైపు రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని కార్గో టెర్మినల్ పూర్తిస్థాయిలో వినియోగంలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఏటా 17,200 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ టెర్మినల్ నుంచి 2024-25లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే రవాణా అయిందని (0.15% వినియోగం) తెలిపారు. ఈ కారణంగా అక్కడ అదనపు కార్గో సౌకర్యాలు కల్పించే ఆలోచన లేదన్నారు.

ఏపీలో భారీగా పెరిగిన టోల్ ట్యాక్స్ వసూళ్లు
ఇదే సమయంలో ఏపీలో టోల్ ట్యాక్స్ వసూళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించారు. రాష్ట్రంలో 2023లో రూ.3,402 కోట్లు, 2024లో రూ.3,495 కోట్లు వసూలు కాగా, 2025లో ఆ వసూళ్లు రూ.4,126 కోట్లకు చేరినట్లు ఆయన తెలిపారు.# పి వెంకటేష్

NO COMMENTS

Exit mobile version