బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
ఘన వ్యర్థాలు నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తతో పర్యావరణానికి హాని, అనర్థాలను కలిగించే అంశాలను అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. మురుగునీటి నిర్వహణ విషయంలో అధికారులు అలసత్వం ఉండరాదన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త, ఘన వ్యర్ధాల సేకరణ జరగాలన్నారు.
చెత్త, ఘన వ్యర్ధాల విభజన నిబంధనలనుసరించి చేపట్టాలన్నారు. ఘన వ్యర్ధాలు పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రాసెసింగ్ యూనిట్లకు పంపే అంశాలపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. మురుగునీటిని పద్ధతి ప్రకారం పట్టణం నుంచి దిగువ ప్రాంతాలకు మళ్లించడం, బయటకు పంపడం, శుద్ధి చేసే యూనిట్ లను విస్తరింప చేయాలన్నారు.
ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, కమిటీ సభ్యులైన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు, తదితరులు పాల్గొన్నారు.
#Narendra




